వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగించే చర్యలను వెంటనే నిలిపి వేయాలని,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిం చాలని,జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్లందరి పేర్లను ఎలాంటి షరతులు లేకుండా తిరిగి చేర్చాలని కోరారు.ఈ సందర్భంగా ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు లాల్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిం చారు.ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరిం చాల్సిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ పేరుతో అర్హులైన వారి ఓటు హక్కుకు భంగం కలిగించే చర్యలు జరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని, ఓటరు జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు అని, ఎలాంటి రాజకీయ కారణాలతోనూ అర్హులైన పౌరులు ఆ హక్కును కోల్పోకూడదని పేర్కొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, ఏఐకేకేఎస్ జిల్లా కార్యదర్శి గోగర్ల శంకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్, ఏఐకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఇందారపు రాజేష్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మహేష్, జిల్లా కార్యదర్శి రాములు (రజక్), ప్రేమ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు, ఏఐకేకేఎస్ జిల్లా నాయకుడు వేల్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం