వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) గెలుపునకు సహకరించిన ఆసిఫాబాద్ డిపో కార్మికులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను కలిసి అభినందించారు. ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా నిలబడి తమ హక్కుల పరిరక్షణకు ముందుకు రావడం అభినందనీయమని కలవేన శంకర్ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, వేతనాలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి కాపాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల దాసు, సీపీఐ ఆసిఫాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, ఏఐటీయూసీ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి భోగి ఉపేందర్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం