వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, సేకరణ, నిల్వలు, ఇతర ప్రాంతాలకు తరలింపుపై అధికారులు నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్, గౌతమి నగర్, కాలేజీ రోడ్‌లోని రేషన్ షాపుల పరిసరాలు, లక్ష్మీ థియేటర్, శ్రీనివాస థియేటర్ ప్రాంతాల్లోని కొన్ని షాపుల వద్ద రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, తరలింపులు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా సేకరించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో అర్హులైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద ఉన్న బియ్యం నిల్వలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే సంబంధిత డీలర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు, నిల్వ, రవాణా చేస్తున్న వారిని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరం లేకపోయినా రేషన్ బియ్యం తీసుకుని విక్రయిస్తున్న లబ్ధిదారులు ఉంటే వారిని కూడా గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసి, ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అర్హులైన పేదలకు చేరేలా అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం