వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్‌లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో తమ తాత కాకా వెంకటస్వామి ఈ ట్రస్ట్‌ను స్థాపించారని చెప్పారు.గూడెం జడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే పాఠశాలకు అవసరమైన బెంచీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను,నెరవేర్చాలని ఆకాంక్షించారు.కార్యక్రమం అనంతరం ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.కాంగ్రెస్ నాయకుల అడ్డుకునే ప్రయత్నంపై స్పందన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, గూడెం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రజల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే అలాంటి విషయాలను తాను పట్టించుకోనని, ప్రజల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు
Reporter
వాస్తవ గమ్యం