వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజూరాబాద్ పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కనీస పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ హోటల్‌లో బిర్యానీ తిని, చిన్న పిల్లలతో సహా పలువురు కస్టమర్లు తీవ్ర ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ఆసుపత్రి పాలవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నిర్వాహకులు డీప్ ఫ్రిజ్‌లలో వారం రోజుల క్రితం నాటి కుళ్లిన చికెన్, మటన్ నిల్వ ఉంచి, వాటినే వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. వంటగదులు ఈగలు, బొద్దింకలతో మురికికూపాలుగా మారడమే కాక, పక్కనే డ్రైనేజీ పైపులు తెరుచుకుని ఉన్నాయి. ఇక చైనీస్ సెంటర్లలో ఆహారం ఆకర్షణీయంగా కనిపించడానికి నిషేధిత సింథటిక్ రంగులను, రుచి కోసం క్యాన్సర్‌కు కారణమయ్యే ‘అజినోమోటో’ (టెస్టింగ్ పౌడర్)ను పరిమితికి మించి వాడుతున్నారు. వంటకు క్లోరినేషన్ చేయని కలుషిత నీటిని, నల్లగా మారే వరకు వందల సార్లు మరిగించిన నూనెను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి, పట్టణంలోని హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం