వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలో గ్యాంగ్ గొడవలు, బహిరంగ దాడులు, యువతలో మత్తుపదార్థాల వినియోగానికి సంబం ధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, ప్రజలకు భద్రత కల్పించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.నియోజకవర్గంలో చోటుచేసు కుంటున్న గొడవలు, దాడులకు సంబంధించిన పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. స్థానికంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరాటాల్లో యువకులను ఉపయోగించుకుంటూ వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. మత్తుపదార్థాల వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు, యువతను గొడవలు, దాడులకు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు. యువత మత్తుపదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలు భయాందోళనలు లేకుండా జీవించేలా పోలీసు యంత్రాంగం భరోసా కల్పించాలని కోరారు.
Reporter
వాస్తవ గమ్యం