వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం మందమర్రిలోని శ్రీ కామాఖ్య దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు నిర్వహించి, వివిధ రకాల పూలతో అలంకరించారు.శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు నిర్వహించి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణలతో మార్మోగింది.
Reporter
వాస్తవ గమ్యం