వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల మండల మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్ అనుచరులు బేర సత్యనారాయణ ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు తలుపులు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించి, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ బెదిరించి భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే వాటిని చర్చలు, విమర్శలు, ప్రెస్‌మీట్లు వంటి ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే వ్యక్తం చేయాలని అన్నారు. రౌడీయిజం, వ్యక్తిగత దాడులు, బెదిరింపుల సంస్కృతికి ప్రజాస్వామ్యంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.గతంలో కూడా మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్‌పై పలు ఆరోపణలు వచ్చాయని, అనేక మందిపై దాడులకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయని పేర్కొన్నారు. బేర సత్యనారాయణ అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నందుకే కక్షసాధింపు ధోరణితో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. బేర సత్యనారాయణ కుటుంబ సభ్యుల ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు అమరశెట్టి రాజు, కౌన్సిలర్లు బోట్ల సత్యనారాయణ, అనిత, నాగరాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల అశోక్ వర్ధన్, సదానందం, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కమలాకర్ రావు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పానుగంటి మధు, బీజేపీ రాష్ట్ర కార్యకర్త దుర్గం అశోక్, మాజీ ఎంపీటీసీ మోటపలుకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం