వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఆ అక్రమాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మంచిర్యాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి డీసీపీకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇటీవల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారని, అదే ఘటనలో కాంగ్రెస్ నాయకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనై పోలీసులు వ్యవహరించరాదన్నారు.మహాప్రస్థానం పేరుతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన రఘునాథ్ రావు, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నాలు మానుకోవాలని, అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం