వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో జాతీయ రహదారి–63 విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న అవార్డుల జారీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియలో జాప్యం లేకుండా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా డి.ఏ.ఓ. రమేష్‌తో కలిసి జాతీయ రహదారి–63 విస్తరణకు సంబంధించి కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.జాతీయ రహదారి–63 విస్తరణ పనులు వేగంగా ముందుకు సాగేలా భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో అవసరమైన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అర్హత కలిగిన కేసుల్లో అవార్డుల జారీని ఆలస్యం చేయవద్దని సూచించారు. పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, సంబంధిత ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం