వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన : మండలం లోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్, ఇందిరానగర్ మధ్యలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కౌటాల మండలం వీర్ణండి గ్రామానికి చెందిన జాడి ప్రదీప్, జాడి మహేష్‌లు బొలెరో వాహనంలో ఇంటి సామానును తీసుకుని మంచిర్యాల వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఆసిఫాబాద్ వైపు నుంచి రెబ్బెన వైపు ఐరన్ పైపుల లోడ్‌తో వెళుతున్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బోల్తాపడగా, బొలెరో వాహనం రోడ్డుపైనే బోల్తాపడింది.వెంటనే స్థానికులు రెబ్బెన పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.రోడ్డుపై బోల్తాపడి ఉన్న వాహనాన్ని వెంటనే స్థానికులు పైకి లేపి మహేష్‌ను బయటకు తీశారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో వాహనం నడుపుతున్న ప్రదీప్ కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. దాంతో స్థానికులు తాడు సహాయంతో బొలెరో డోర్, క్యాబిన్‌ను బయటకు లాగి అతికష్టం మీద ప్రదీప్‌ను బయటకు తీశారు.వెంటనే ఇద్దరినీ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రదీప్‌కు రెండు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా, మహేష్‌కు స్వల్పగాయాలయ్యాయి.అయితే రెండు వాహనాలు ఒకే మార్గంలో ప్రయాణిస్తూ ఎదురెదురుగా ఢీకొనే అవకాశం ఏమాత్రం ఉండదు. కానీ బొలెరో, లారీని ఎదురుగా ఢీకొట్టడాన్ని చూస్తే బొలెరో వాహనం రాంగ్‌రూట్‌లో కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వైపు వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం మూలంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం