వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : అపరాలు,నూనెగింజల పంటల్లో శాస్త్రీయ, ఆధునిక యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు ఏటీఎంఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సరైన సమయంలో విత్తుకోవడం, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి అంశాలను వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ పంటలకు అవసరమైన మేరకే నీటిని అందించి వృథాను అరికట్టాలని, కలుపు మొక్కలను ప్రారంభ దశలోనే నివారించాలని సూచించారు. చీడపీడలను తొలిదశలో గుర్తించి, అధికారుల సూచనల మేరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీఎంఏ అధికారి సంజీవ్, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం