వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : పోలీస్ అమరవీరుల త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, దేశ రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో వారు అందించిన సేవలు చిరస్మరణీయమని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం పోరాడిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ పాల్గొని అమరవీరులకు ఘనంగా. నివాళుల ర్పించారు.తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీరమరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా సాయుధ పోలీసులు శోక శ్రద్ధాంజలి నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వీరుల త్యాగాలను స్మరించు కున్నారు.గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీస్ అమర వీరుల పేర్లను డీఎస్పీ బి. అశోక్ చదివి వినిపించారు. పోలీసు విధి ఒక పవిత్రమైన కర్తవ్యం అనంతరం ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, పోలీసు విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధతతో కూడిన పవిత్రమైన కర్తవ్యమని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడం కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో 14 మంది పోలీసుల ప్రాణత్యాగం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో 1985 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 14 మంది పోలీసులు సమాజ శ్రేయస్సు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని ఎస్పీ తెలిపారు. వారి సేవలను స్మరించుకోవడంతో పాటు, వారి త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోలీసు సిబ్బంది పండుగలు, సెలవులకు అతీతంగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటారని, ప్రజల భద్రత కోసం నిరంతరం అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచిం చారు.అమరవీరుల కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు.వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారికి గౌరవం తెలియజేశారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 22 నుంచి జిల్లాలో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, వీడియోగ్రఫీ పోటీలతో పాటు విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.యువత, విద్యార్థులు, ఫొటోగ్రఫీ, వీడియో రంగాలపై ఆసక్తి ఉన్నవారు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు, సేవలు, ప్రజా రక్షణలో వారి పాత్రను భావితరాలకు తెలియజేయడమే ఈ కార్యక్రమా ల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు బి. అశోక్, వాహిదుద్దిన్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు ,ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం