వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ఉట్నూర్: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమ ఫలాలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు.శనివారం మధ్యాహ్నం ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లోని సమావేశ మందిరంలో గిరిజన ఏజెన్సీ మండలాలకు చెందిన పాత్రికేయులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, అటవీ హక్కులు, భూ హక్కులు, గిరిజనుల జీవనోపాధి అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు వారధిగా నిలవాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు, సలహాలు అందిస్తే వాటిని అధికారులు సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.గిరిజన ప్రాంతాల్లో అపారమైన సహజ సంపద, సాంస్కృతిక వారసత్వం, జలపాతాలు, కొండలు, అడవులు, పురాతన దేవాలయాలు, గిరిజన సంప్రదాయాలు పర్యాటకాభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అలాంటి పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించేందుకు పాత్రికేయులు సహకరించాలని కోరారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.గిరిజనుల హక్కుల పరిరక్షణ, విద్యా ప్రమాణాల మెరుగుదల, వైద్య సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యంతో పాటు మీడియా సహకారం ఉంటే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు.సమావేశంలో పాల్గొన్న పాత్రికేయులు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు, సమస్యలను ప్రస్తావించారు. వాటిపై ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందిస్తూ, ప్రజలకు మేలు చేసే ప్రతి అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో అదనపు పౌర సంబంధల అధికారి వై సంపత్ కుమార్ ఐటీడీఏ అధికారులు, గిరిజన ఏజెన్సీ మండలాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం