వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి రూరల్, వాస్తవ గమ్యం, ఆగస్టు 24: మండలంలోని పలు ప్రధాన రహదారులు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మందమర్రి పాలచెట్టు నుంచి అవాడం వెళ్లే ప్రధాన రహదారితో పాటు, ఆదిల్‌పేట్ నుంచి పొన్నారం వయా రసూల్‌పల్లె, జైపూర్ వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మందమర్రి పాలచెట్టు వద్ద ప్రారంభమై అవాడం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.ఈ రహదారిని ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు వినియోగిస్తున్నారు.అదేవిధంగా ఆదిల్‌పేట్ నుంచి పొన్నారం వయా రసూల్‌పల్లె, జైపూర్ వెళ్లే ప్రధాన రహదారి కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. సండ్రోనిపల్లె గ్రామం దాటిన అనంతరం సారంగపల్లి (దుబ్బపల్లె) గ్రామం మూలమలుపు వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా. మారాయి.వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు రోడ్డుకు ఇరువైపులా బురద మట్టి, మట్టి కుప్పలు పేరుకుపోవడంతో పాటు చెట్లు, పిచ్చి మొక్కలు, పొదలు రహదారిపైకి విస్తరించాయి. దీంతో రహదారి వెడల్పు తగ్గిపోయి ఎదురెదురుగా వాహనాలు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు బురదలో జారిపడే ప్రమాదం ఉంది.రాత్రి వేళల్లో గుంతలు, రహదారిపైకి విస్తరించిన చెట్లు, పొదలు సరిగా. కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది.చిన్నపాటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు.నూతన రహదారి నిర్మించాలి ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రెండు ప్రధాన రహదారులను కేవలం తాత్కాలిక మరమ్మతులతో కాకుండా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మందమర్రి పాలచెట్టు నుంచి అవాడం వెళ్లే ప్రధాన రహదారితో పాటు, ఆదిల్‌పేట్ నుంచి పొన్నారం వయా రసూల్‌పల్లె, జైపూర్ వరకు ఉన్న ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా అవసరమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రహదారిపై పేరుకుపోయిన బురద మట్టి, మట్టి కుప్పలను తొలగించాలని కోరుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి రహదారి వెడల్పును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలి.రహదారుల దుస్థితి కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదకరమైన గుంతల వద్ద తాత్కాలికంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, వెంటనే గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నిధులు కేటాయించి శాశ్వత ప్రాతిపదికన నూతన రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఈ సమస్యలపై మందమర్రి మండల ప్రజావాణి అధికారికి వినతిపత్రం సమర్పించి, క్షేత్రస్థాయిలో. రహదారులను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, విద్యార్థులు మరియు వాహనదారుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మందమర్రి మండల ప్రధాన కార్యదర్శి వంజరీ వెంకటేష్, ఆడిగోపుల్ల మురళీ, కాల్వల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం