వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: ఆదిల్ పేట్ గ్రామ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం గతంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 30 ఎకరాలకు పైగా భూమిని పరిరక్షించాలని, ఆ భూములపై ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని TVJS మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్‌కుమార్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఎర్ర చెరువు ఈ ప్రాంత రైతులకు ప్రధాన సాగునీటి ఆధారంగా ఉందని, చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి దిగువన ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాధనంతో భూములను కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు తిరిగి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిన పరిస్థితిపై సమగ్ర విచారణ అవసరమని కోరారు.రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహించి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములను గుర్తించి, వాటిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలు నిజమని తేలితే చట్ట ప్రకారం తొలగించడంతో పాటు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని కోరారు.అలాగే ప్రజాధనంతో కొనుగోలు చేసిన భూముల ఉద్దేశ్యం నెరవేరేలా ఎర్ర చెరువు అభివృద్ధి పనులు చేపట్టి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అనంతరం తీసుకున్న చర్యలను లిఖితపూర్వకంగా ప్రజలకు తెలియజేయాలని ప్రజావాణి ప్రత్యేక అధికారిని కోరారు.ఈ ఫిర్యాదు ప్రతులను మంచిర్యాల జిల్లా కలెక్టర్, RDO, నీటిపారుదల శాఖ EE, CCLA, రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపినట్లు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం