వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దోమల ఉద్ధృతి తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కాలనీల్లో చిన్నపిల్లలు దోమల కాట్లతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు కుట్టడంతో పిల్లలు ఒంటిపై, చేతులు, కాళ్లపై గోకుకోవడం వల్ల చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని పలు కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల దోమల వ్యాప్తి మరింత పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ (పొగ స్ప్రే) నిర్వహించాలని, డ్రైనేజీలు, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంపులు) ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలు, మందులు అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని దోమల నివారణతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం