వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ జాఫర్‌నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఐఎం మంచిర్యాల అధ్యక్షుడు మహమ్మద్ షకీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అఫాన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.జాఫర్‌నగర్‌లో సుమారు 150 ఇళ్లకు సంబంధించిన మురుగునీటి పారుదల సమస్యను పరిష్కరించకుండానే సంబంధిత భూమిలో మట్టి పోసి ప్లాట్లుగా మార్చే పనులు చేపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా ప్లాట్లను విక్రయిస్తే, వాటిని కొనుగోలు చేసే ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగా డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న కుటుంబాలతో పాటు భవిష్యత్తులో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్లాట్ల విక్రయాలు, నిర్మాణాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ తరఫున అడ్డుకుంటామని ఎంఐఎం నాయకులు హెచ్చరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ మార్గాన్ని పరిరక్షిస్తూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Reporter
వాస్తవ గమ్యం