వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు బాధ్యురాలిని చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తోందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో బీసీలకు ఒక విధానం, రెడ్డి సామాజిక వర్గానికి మరో విధానం కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా విమర్శించిన ఇతర నాయకుల విషయంలో ఇదే తరహాలో కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.బీసీ మహిళా మంత్రికి ఒక న్యాయం.రెడ్డి నాయకులకు మరో న్యాయమా?” అని నరెడ్ల శ్రీనివాస్ నిలదీశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.బీసీలకు రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చిన ప్రతిసారీ వారిని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.బీసీలను ఓట్ల కోసం ఉపయోగించుకుని, అధికారం విషయంలో అణగదొక్కే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేయాలని కోరారు. తెలంగాణలోని బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించాలని సూచించారు.బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రాజకీయ నిర్ణయాలను బీసీ సమాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్, బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా నాయకులు బియ్యాల సత్తయ్య, జక్కం రవీందర్, పట్టణ నాయకులు వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్, ఎం.డి. షఫీ, కొడుకా మోహన్, పల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం