వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. డీఆర్‌ఎఫ్, హైడ్రా మున్సిపల్, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భవనంలో నివసిస్తున్న వారిని సురక్షితంగా ఖాళీ చేయించారు. భవనం వద్దకు ఎవరూ వెళ్లకుండా డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అంజయ్య నగర్‌లో ఆరు అంతస్తులు భవనం కుప్పకూలిన ఘటన మరవక ముందే ఎన్టీఆర్ నగర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. నాణ్యత, పునాది పటిష్టత సరిగా లేకపోవడంతోనే.. భవనం ఒరిగి పోయినట్లు అధికారులు గుర్తించారు. కేవలం 40 గజాల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టడం, అదనపు అంతస్తులు కారణంగా పునాదులపై ప్రభావం పడి భవనం ఒరిగి పోయినట్లు గుర్తించారు. భవనాన్ని కూల్చివేతలు చేపట్టి సంబంధిత యజమానిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. భవనం పగుళ్లు రావడంతో గమనించిన స్థానికులు అప్రమత్తం చేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు పారిపోయారు. ఒరిగిన భవనాన్ని కూల్చివేస్తే సమీపంలో ఉన్న ఇళ్లకు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు
Reporter
వాస్తవ గమ్యం