వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మీ–షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేదల సంక్షేమం కోసం దూరదృష్టితో పనిచేసిన గొప్ప నాయకుడని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మీ–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై 41 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎవరు అడగకముందే పేదల అవసరాలను గుర్తించి, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.కేసీఆర్ హయాంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చాయని అన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. పేదల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం