వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నల్గొండ జిల్లాలో నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనపై మందమర్రి మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది.ఘటనను నిరసిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు మందమర్రి మార్కెట్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ట్రస్మా నాయకులు తెలిపారు. రాష్ట్ర, జిల్లా సంఘాల పిలుపు మేరకు శుక్రవారం చేపట్టే పాఠశాలల బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ట్రస్మా మండల అధ్యక్షుడు పెద్దపెల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ డ్రగ్స్ సంస్కృతి, చిన్నారులకు అందుబాటులోకి వస్తున్న సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, హింసాత్మక కంటెంట్ విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మండల గౌరవాధ్యక్షుడు పోల్ శ్రీనివాస్ మాట్లాడుతూ రూపారెడ్డి హత్య ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. పాఠశాలల్లో క్రమశిక్షణ అమలు చేసే విషయంలో ఉపాధ్యాయులకు తగిన రక్షణ, స్వేచ్ఛ కల్పించాలని కోరారు. రూపారెడ్డి హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులు,పాఠశాలల. యాజమాన్యాలు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ట్రస్మా నాయకులు పిలుపునిచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం