వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను పక్కనపెట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేసే ప్రయత్నాలను ప్రభుత్వం ,విరమించుకోవాలని డిమాండ్ చేశారు.కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 9న కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన పిటిషన్‌పై ప్రభుత్వం అప్పీల్ చేయాలని, అలా చేయని పక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ నిరసన స్థలానికి చేరుకుని బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడారు. మంచిర్యాలలో జరుగుతున్న నిరసనల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం